ఆర్టికల్ 370 రద్దును కశ్మీర్ ప్రజలు సానుకూలంగా స్వీకరించారని లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లోయలో చాలా కాలం పాటు శాంతి నెలకొందని వెల్లడించారు. కానీ కశ్మీర్‌లో హింసను సృష్టించడానికి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు.
శ్రీనగర్ నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవంతిపొరాలోని వ్యూహాత్మక ఎక్స్‌వీ కార్ప్స్కు నేతృత్వం వహిస్తున్నారు లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు. షోపియాన్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండు ఎన్కౌంటర్ల అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి లోయలో దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు.
"జనవరి-ఫిబ్రవరి నాటికి ప్రజలు బయట తిరగడం మొదలుపెట్టారు. పాఠశాలులు తెరుచుకున్నాయి. గుల్మార్గ్లో శీతాకాల పర్యటనలు మొదలయ్యాయి. లోయలో సాధారణ పరస్థితులు దాదాపు నెలకొన్నట్టు మాకు అనిపించింది. అప్పుడొచ్చింది కరోనా. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడ మరోమారు లాక్‌డౌన్‌ను విధించాల్సివచ్చింది."
-- లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు
అయితే లోయలో శాంతిని చూసి పాకిస్థాన్ ఓర్చుకోలేకపోతోందని మండిపడ్డారు బీఎస్ రాజు. అందువల్ల పాకిస్థాన్ వ్యాప్తి చేసే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు.
"లోయలో శాంతిని చూసి పాకిస్థాన్ ఓర్చుకోలేకపోతోంది. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలని ప్రణాళికలు రచించుకుంది. ఇందుకోసం రెండు మార్గాలను ఎంచుకుంది. నియంత్రణ రేఖ వెంబడి ఆయుధాలను తరలిస్తోంది. అసత్య వార్తలను వ్యాపింపజేస్తోంది. ఇది ఎంతో ముఖ్యం. లోయలో నెలకొన్న పరిస్థితులను చూసి సంతోషంగా లేనివారు ఎవరైనా ఉంటే.. అది పాకిస్థాన్ ఒక్కటే. అందుకని ఆ ఆసత్య వార్తలపై మనం యుద్ధం చేయాలి. 130 కోట్ల భారతీయులు ఇందుకు సహకరించాలి. పాకిస్థాన్ నుంచి వచ్చే తప్పుడు వార్తలను నమ్మకూడదు. క్షేత్రస్థాయిలో మేము పోరాడుతున్నప్పుడు.. ప్రజల నుంచి సహకారం కోరుకుంటాం. నిజమైన వార్తలను నమ్మి.. అసత్యాలను తరమికొట్టాలనుకుంటాం."
-- లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు