దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ప్రజా రవాణా లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ 4.0లో భాగంగా నిబంధనల మేరకు ప్రజా రవాణాకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు నడుస్తుండగా, సోమవారం నుంచి దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల బాలుడు ఒంటరిగా దిల్లీ నుంచి బెంగళూరు విమాన ప్రయాణం చేశాడు.
సోమవారం దిల్లీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో ఐదేళ్ల బాలుడు విహాన్ శర్మ కూడా ఉన్నాడు. మూడు నెలల క్రితం దిల్లీ వెళ్లిన విహాన్ లాక్‌డౌన్ కారణంగా అక్కడ బంధువుల ఇంట్లోనే ఉండిపోయాడు. సోమవారం విమానాలు పునః ప్రారంభంకావడం వల్ల తన తల్లిని కలుసుకునేందుకు బెంగళూరు చేరుకున్నాడు. ప్రత్యేక కేటగిరీ ప్రయాణికుడిగా విహాన్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. విహాన్ బెంగళూరు చేరుకున్న సందర్భంగా అతడి తల్లి ఆనందంతో అక్కున చేర్చుకుంది.