అతడు ఓ చిన్నారిని హత్య చేశాడు. కోర్టు దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. 18ఏళ్ల జైలు జీవితంలో కవిగా మారాడు. పద్యాలు రాశాడు. వాటిలోని లోతైన భావాన్ని గ్రహించిన కోర్టు... అతడిలో మార్పు వచ్చిందని గుర్తించింది. మరణ శిక్షను... జీవిత ఖైదుగా మార్చింది.
18 ఏళ్ల క్రితం కథ ఇది. అప్పుడు ధన్యేశ్వర్ సురేశ్ బోర్కార్ వయసు 22ఏళ్లు. ఓ చిన్నారి హత్య కేసులో నిందితుడు అతడు. పుణె కోర్టు అతడిని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. 2006లో బాంబే హైకోర్టు పుణె కోర్టు తీర్పును సమర్థించింది. అప్పటి నుంచి ఉరి కంభం ఎప్పుడు ఎక్కాల్సి వస్తుందోనన్న దిగులుతో జైలు జీవితం గడుపుతున్నాడు సురేశ్. శిక్ష కాలంలో తన తప్పు తెలుసుకున్నాడు. ఈ సమయంలోనే అనేక పద్యాలు రాశాడు.
2006లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సురేశ్. అతడి అభ్యర్థనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది.
నిందితుడు 18 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ కాలంలో అతడి పద్యాల రచనా శైలి, అందులో భావాలను గమనిస్తే పరివర్తన వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నాం
- సుప్రీంకోర్టు