దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 10, 12వ తరగతుల పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్డీ). అయితే .. విద్యార్థులు ఇతర పరీక్ష కేంద్రాల్లో కాకుండా సొంత పాఠశాలలోనే పరీక్షలకు హాజరవుతారని స్పష్టం చేసింది.
లాక్డౌన్ విధించక ముందు జరిగిన పరీక్షల జవాబు పత్రాల ముల్యాంకన ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో జులై చివరి వారంలో ఫలితాలు ప్రకటించేందుకు ప్రణాళిక రచిస్తోంది హెచ్ఆర్డీ. ఈ మేరకు పెండింగ్ పరీక్షల నిర్వహణపై వివరాలు వెల్లడించింది సీబీఎస్ఈ బోర్డు.
" సొంత పాఠశాలలోనే విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకే ఇతర కేంద్రాలలో నిర్వహించకూడదని నిర్ణయించాం. భౌతిక దూరం నియమాలను పాటించటంపై ఆయా పాఠశాలలదే భాధ్యత. విద్యార్థులు తప్పనిసరిగా సొంత శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి, మాస్కు ధరించాలి."
- సీబీఎస్ఈ బోర్డు
జులై 1-15 నుంచి పరీక్షలు..
లాక్డౌన్తో వాయిదా పడిన 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ను సోమవారం (మే18న) విడుదల చేసింది సీబీఎస్ఈ. జులై 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.