క్లిష్ట సమస్యల పరిష్కారానికి అరుణ్ జైట్లీపైనే పార్టీ ఆధారపడేదని గుర్తు చేసుకున్నారు భాజపా అగ్ర నేత లాల్ కృష్ణ అడ్వాణీ. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించే మేధస్సు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"అత్యంత సన్నిహితుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. న్యాయరంగంలో గొప్ప వ్యక్తిగా ఎదగడం సహా గొప్ప పార్లమెంటేరియన్, పరిపాలకుడిగా నిలిచారు. నేను పార్టీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీ పాలకవర్గంలోకి వచ్చిన కొద్ది మందిలో జైట్లీ ఒకరు. దశాబ్దాల పాటు ఎంతో విశ్వాసంతో పార్టీకి సేవలందించారు. పదునైన విశ్లేషణాత్మక మేధస్సు గల వ్యక్తి జైట్లీ. క్లిష్ట సమస్యల పరిష్కారానికి భాజపాలోని ప్రతి ఒక్కరు ఆయనపైనే ఆధారపడేవారు."
- ఎల్కే అడ్వాణీ, భాజాప అగ్రనేత
ప్రతి దీపావళికి జైట్లీ కుటుంబ సమేతంగా ఇంటికి వచ్చేవారని గుర్తుచేసుకున్నారు అడ్వాణీ. జైట్లీ మృతి భాజపా పార్టీకే కాదు మొత్తం సంఘ్ పరివార్‌కు తీరని లోటు అని పేర్కొన్నారు.
చెరగని ముద్ర...
అరుణ్ జైట్లీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పేదల సంక్షేమం, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలిపేందుకు ప్రధాని ఆలోచనలు ఆచరణలో పెట్టడంలో చెరగని ముద్రవేశారని కొనియాడారు షా. జైట్లీ ఎప్పుడు సామాన్యుల సంక్షేమం గురించే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనను దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని తెలిపారు.
గొప్ప నేతను కోల్పోయింది...
అరుణ్ జైట్లీ మృతి తనను ఎంతగానో బాధించిందని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి. దేశం ప్రముఖ సీనియర్ న్యాయవాది, గొప్ప నేతను కోల్పోయిందన్నారు. దేశ న్యాయవ్యవస్థ తరఫున జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీ చూడండి: జైట్లీ మృతిపై మోదీ భావోద్వేగ సందేశం