క్లోమ గ్రంథి కాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అంత్యక్రియల్ని రాజధానిలోని మిరామర్లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. పారికర్ పార్థీవ దేహాన్ని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఉంచుతారు. అక్కడి నుంచి ప్రజల దర్శనార్థం కాలా అకాడమీకి తరలిస్తారు. సాయంత్రం 4 గంటల సమయంలో అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
పారికర్ వారసుడిపై భేటీ
మనోహర్ పారికర్ మృతితో నూతన ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకునేందుకు గోవాకు చేరుకున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. 2017 అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపా కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు గడ్కరీనే కీలకంగా వ్యవహరించారు.
భాజపా కూటమిలోని గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎంజీపీలతో నూతన ముఖ్యమంత్రి నియామకంపై చర్చించారు గడ్కరీ. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ దోండ్, గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయి, ఎంజీపీ నేత సుదిన్ ధవలికర్ పాల్గొన్నారు.
40 స్థానాల గోవా అసెంబ్లీలో ప్రస్తుతం 36 మంది సభ్యులు ఉన్నారు. భాజపాకు 12, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎంజీపీలకు చెరొక ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఎన్సీపీకి ఒకరు, స్వతంత్రులుగా మరో ముగ్గురు కొనసాగుతున్నారు. ఉదయం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని భాజపా కూటమి ప్రకటించింది.
గోవా అసెంబ్లీలో 14 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉంది కాంగ్రెస్. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు ఆ పార్టీ ఇటీవల లేఖ రాసింది .