గోవా ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ కేంద్ర రక్షణమంత్రిగా తనదైన ముద్ర వేశారు. లక్షిత దాడుల నుంచి రఫేల్ ఒప్పందం వరకు తన పదవీ కాలం స్వల్పమైనా దేశ రక్షణ కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొద్దికాలంగా క్లోమగ్రంథి కాన్సర్‌తో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన పారికర్ రక్షణరంగంపై చేసిన సంతకం మరచిపోలేనిది. 2014 నవంబర్‌లో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పారికర్ మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు.
లక్షిత దాడులతో
2016లో జమ్ముకశ్మీర్‌లోని ఉరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది సైనికులను బలి తీసుకున్నారు. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ లక్షిత దాడుల ద్వారా జవాన్ల మృతికి బదులు తీర్చడంలో కీలకంగా వ్యవహరించారు పారికర్.
తేజస్ జాతికి అంకితం
ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ను పూర్తిచేసేందుకు వేగవంతమైన చర్యలు తీసుకున్నారు పారికర్. పారికర్ హయాంలోనే వాయుసేన అమ్ములుపొదిలోకి తేజస్ చేరింది.
రఫేల్ నీలినీడలు
2016 సెప్టెంబర్‌లో జరిగిన రఫేల్ ఒప్పందం పారికర్‌పై విమర్శలకు తావిచ్చింది.
రక్షణశాఖ సంతాపం
తన కంటే ముందు రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పారికర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నిర్మలా సీతారామన్. త్రివిధ దళాల్ని బలోపేతం చేయడంలో సమర్థంగా కృషి చేశారని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
పారికర్ మృతికి రక్షణమంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది. 2014 నుంచి 2017 వరకు రక్షణ మంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది.