రైతుల ఆందోళనపై విపక్షాల నిరసనలతో లోక్‌సభ సమావేశాలకు వరుసగా మూడోరోజూ అంతరాయం కలిగింది. వివాదాస్పద సాగుచట్టాలపై ప్రత్యేక చర్చ పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌తో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.
తొలుత సాయంత్రం 4 గంటలకు సభ సమావేశం కాగానే.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. నినాదాలు చేయడం ఎంతకీ ఆపకపోవడంతో సభ 5 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభం కాగానే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్,, మధ్యవర్తిత్వ, సయోధ్య సవరణ బిల్లు-2021ను ప్రవేశపెట్టారు.
అయితే సభ ప్రారంభమైన ప్రతిసారి విపక్ష సభ్యుల నిరసనలను కొనసాగించారు. ఈ పరిస్థితిలో మూడో రోజు మొత్తం నాలుగుసార్లు వాయిదా పడ్డ సభ.. చివరగా రాత్రి 8.30గంటలకు ప్రారంభమైంది.అప్పుడు కూడా విపక్షాలు వెనక్కి తగ్గకపోవడం వల్ల సభను సభాపతి ఓం బిర్లా శుక్రవారానికి వాయిదా వేశారు.
లోక్‌సభలో పరిణామాలపై స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక దృష్టి సారించారు. సభలో ఆందోళనల విరమణ కోసం చర్చలు చర్చలు సైతం జరిపారు. అయితే అవి ఫలించినట్లు లేదని తెలుస్తోంది.