'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా నేడు విద్యార్థులతో సంభాషించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బోర్డ్ ఎగ్జామ్స్‌లో ఒత్తిడిని జయించేందుకు విద్యార్థులకు మోదీ సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
ఈ మేరకు మూడో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని దిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో సోమవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల నుంచి 2,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమానికి దాదాపు 2.6 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాసరచన పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా 1,050 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. గతేడాది 1.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ప్రశ్నలు-సమాధానాలు
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు... ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం లభిస్తుంది. గతేడాది విద్యార్థులు అడిగిన 16 ప్రశ్నలకు సమాధానం చెప్పిన మోదీ... 2018 పరీక్షా పే చర్చాలో 10 ప్రశ్నలకు బదులిచ్చారు.
జనవరి 16నే జరగాల్సిన ఈ కార్యక్రమం పండగ సీజన్ కారణంగా వాయిదా పడింది.