దేశ రక్షణలో ప్రాణ త్యాగానికి కూడా వెనకాడబోమని భారత సైన్యం మరోమారు నిరూపించింది. దేశంలోకి చొరబాటుకు యత్నించిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ప్రయత్నంలో ముష్కరులందరిని హతమార్చి.. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.
ప్రతికూల వాతావరణంలోనూ శత్రువులను మట్టికరిపించడమే లక్ష్యంగా భారత సైన్యం ముందుకు సాగుతుందని.. జవాన్ల త్యాగం మళ్లీ రుజువు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని కెరన్ సెక్టర్లో గత వారం జరిగిన ఈ ఆపరేషన్.. మన జవాన్ల ధైర్య సాహసాలకు ఓ ఉదాహరణ.
ఆపరేషన్ సాగిందిలా..
తీవ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో ఈ నెల 2న పారా రెజిమెంట్ బృందాన్ని కుప్వారా జిల్లాలోని కిరన్ సెక్టర్లో మోహరించారు అధికారులు. అయితే తొలుత ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వెనుదిరిగారా? లేదా మంచు కారణంగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పెద్ద చెట్ల మధ్య నక్కి ఉన్నారా? అనే దానిపై జవాన్లకు స్పష్టత రాలేదు. ఉగ్రవాదుల్లో ఎలాంటి కదలికలు లేనందున.. వారు వెనుదిరిగారని భావించారు. కానీ ఈ నెల 3న.. 'గుజ్జర్ ధోక్స్'లో కదలికలు కనిపించాయి. సాధారణంగా ఈ ధోక్స్ను వేసవిలో షల్టర్లుగా ఉపయోగిస్తారు.
వెంటనే పారా మిలిటరీ బృందం ఓ ప్రణాళికను రచించింది. ఓవైపు బృందం, మరో వైపు ఇతర సైన్యం.. మధ్యలో ఉన్న ఉగ్రవాదులపై దాడి చేయాలన్నది అసలు ప్రణాళిక. అందులో భాగంగా షమ్శబరి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు సైనికులు. ఈ నెల 4వ తేదీన.. కిందకు దిగుతున్న సైనికుల బృందాన్ని చూసి ముష్కరులు వెంటనే అప్రమత్తమయ్యారు. జవాన్లపైకి కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో భారత సైన్యం ఎదురుకాల్పులతో దీటుగా సమాధానమిచ్చి.. ముష్కరులను హతమార్చింది. ఘటనాస్థలంలో ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను భారీగా స్వాధీనం చేసుకుంది.
ప్రాణత్యాగం..
ఈ ఆపరేషన్‌లో సుబేదార్ సంజీవ్ కుమార్, హవేల్దార్ దేవేంద్ర సింగ్, పారా ట్రూపర్ బాల్ క్రిషన్, అమిత్ కుమార్, ఛత్రపాల్ సింగ్ అమరులయ్యారు. వీరిలో సంజీవ్ కుమార్ ఘటనాస్థలంలోనే మరణించగా.. మిగిలిన వారు ఆసుపత్రులకు వెళ్తున్న మార్గంలో ప్రాణాలు కోల్పోయారు.
'ఆపరేషన్‌లో అమరులైన జవాన్లకు భారత సైన్యం సెల్యూట్ చేస్తోంది. ఉగ్రవాదుల నుంచి తమ సరిహద్దును సైన్యం ఎంతో సమర్థవంతంగా సంరక్షించుకోగలదు.'
--- భారత సైన్యం