బెంగళూరు కెంపపురలో నాలుగు అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగిపోయి పిసా టవర్ను తలపిస్తోంది. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పునాది వేయడానికి తవ్వకాలు ప్రారంభించిన సమయంలో భవనం ఇలా ఓ వైపునకు కుంగిపోవడం అపార్ట్మెంట్ ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
36 మంది సేఫ్
అపార్ట్మెంట్లో ప్రస్తుతం 36 మంది నివసిస్తున్నారు. అదృష్టవశాత్తు ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, రోడ్డుపై పడిపోతున్నట్లుగా వంగిపోయిన భవనం ఏ క్షణాన తమపై పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్త్తున్నారు కాలనీవాసులు. తీవ్ర భయాందోళనలకు గురైన చాలా మంది తమ ఇళ్లను వదిలి ఒరిగిపోయిన భవనానికి దూరంగా వెళ్లిపోయారు.
కారణం తెలిశాకే చర్యలు...
అయితే వంగిపోయిన భవనం చట్టవిరుద్ధంగా నిర్మించిన దాఖలాలేవీ లేవని బృహత్ బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) సంస్థ అధికారులు వెల్లడించారు. సాంకేతిక నిపుణులు పరిస్థితిని అంచనా వేస్తున్నారని.. వారి సూచనల మేరకు తరుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలంలో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఇంటి పునాది స్థంభాన్ని జేసీబీ ఢీకొందని.. అందుకే ఈ ప్రమాదం జరిగిందని భవన యజమాని సురేశ్ చంద్ర జైన్వాపోయారు. కనీస సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డ ఆయన.. ఖాళీ స్థలం యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.