జమ్ముకశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులకు తెగబడింది.
పాక్ సైన్యం కవ్వింపు చర్యలను సమర్థంగా తిప్పికొట్టినట్లు భారత సైన్యాధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఓ బాలుడు గాయపడినట్లు పూంచ్ జిల్లా అధికారులు చెప్పారు. వారిని చికిత్స కోసం సైనిక ఆస్పత్రికి తరలించామన్నారు.
మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెందార్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలోని గ్రామాలపై పాక్ సైన్యం మోర్టార్లతో దాడి చేసిందని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 2 వేల కన్నా ఎక్కువ సార్లు కాల్పులకు తెగబడిందని సైనిక అధికారులు ప్రకటించారు. ఈ దాడుల్లో భారత సైనికులు 21 మంది మరణించారు.