దాయాది పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శాంతి వచనాలు వల్లిస్తూనే భారత్‌ను దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా గుళ్ల వర్షం కురిపిస్తోంది. మోర్టార్లను ప్రయోగిస్తోంది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ సైన్యం దీటుగా బదులిస్తోంది.
జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని నౌషెరా, సుందరబని సెక్టార్లు, పూంఛ్ జిల్లాలోని కృష్ణాఘాటి సెక్టార్లపై ఇవాళ ఉదయం పాక్ భారీగా కాల్పులకు తెగబడింది. భారత భద్రతా దళాలు దీటుగా స్పందిస్తున్నాయి. నౌషెరాలో 3 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు.
పాక్ పైశాచికత్వం
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. దీనికి ప్రతిగా పాక్ భారత భూభాగంపై వైమానిక దాడి చేసింది. దీనిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అప్పటి నుంచి పాక్ నియంత్రణ రేఖ వెంబడి తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.
గత వారం రోజులుగా కశ్మీర్లో పాక్ ఆడుతోన్న మృత్యుక్రీడకు నలుగురు వ్యక్తులు బలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.