కార్గిల్ యుద్ధ విజయంపై లోక్‌సభ వేదికగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తిస్థాయి యుద్ధం వస్తే భారత్ ముందు దాయాది పాకిస్థాన్ నిలవలేదని వ్యాఖ్యానించారు. చిన్నయుద్ధంలోనైనా తలపడలేదని స్పష్టం చేశారు రాజ్‌నాథ్.
'కార్గిల్ యుద్ధం' అంశంపై చర్చ జరపాలని స్పీకర్‌కు విన్నవించారు కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి. సభాపతి అనుమతితో అధిర్ చర్చను ప్రారంభించగా రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారు. అంతకుముందు పార్లమెంట్ ప్రారంభమైన వెంటనే కార్గిల్ వీరజవాన్లకు నివాళులర్పిస్తూ స్పీకర్ ప్రకటన చేశారు.
పాకిస్థాన్ పరోక్ష యుద్ధం చేస్తున్నప్పటికీ దానిని సమర్థంగా భారత్ ఎదుర్కొంటుందన్నారు రాజ్‌నాథ్.
"నేడు దేశవిదేశాల్లో ఉండే భారత పౌరులు జులై 26ను కార్గిల్ విజయ్ దివస్‌గా కొనియాడుతున్నారు. ఈ సంవత్సరానికి కార్గిల్ యుద్ధం గెలిచి 20 ఏళ్లయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. యుద్ధంలో సైనిక పరాక్రమాన్ని దేశం ఎప్పుడు మరచిపోదు. మూడు సార్లు పాకిస్థాన్‌తో యుద్ధం జరిగింది. భారత సైనికులు ఈ మూడింటిలో చూపిన పరాక్రమంపై విశ్వాసంతో చెప్పగలను.... భారత్‌తో దాయాది పాకిస్థాన్ పూర్తి స్థాయి యుద్ధం చేయలేదు... చిన్న యుద్ధమైనా చేయలేదు. కేవలం పరోక్ష యుద్ధం మాత్రమే చేస్తుంది. కార్గిల్ యుద్ధంలో పోరాడిన ప్రతి సైనికుడికీ వినయంతో కూడిన నమస్కారాలు తెలియజేస్తున్నా."
-రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి
ఇదీ చూడండి: 'వాజ్‌పేయీ నమ్మకాన్ని సైన్యం వమ్ము చేయలేదు'