గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది విదేశాంగ శాఖ. ఈ కేసులో పాక్ వైఖరి అసభ్యకరంగా ఉందని వ్యాఖ్యానించింది. కేసులో అవసరమైన ప్రత్యామ్నాయాల కోసం భారత్ అన్వేషిస్తుందని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ప్రకటన విడుదల చేశారు.
"చివరి ప్రయత్నంగా.. జూలై 18న భారత్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి ప్రయత్నించింది. అయితే సరైన పత్రాలు లేకపోవడం, పవర్ ఆఫ్ అటార్నీ లేని కారణంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేమని కుల్‌భూషణ్ తరఫున వాదనలు వినిపిస్తున్న పాక్ న్యాయవాది వెల్లడించారు."
-అనురాగ్ శ్రీవాత్సవ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
అయితే ఇంతకుముందు పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు జులై 20వరకు దాయాది అనుమతించింది.
2017 ఏప్రిల్లో గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలతో కుల్భూషణ్కు మరణశిక్ష విధించింది పాక్ మిలిటరీ కోర్టు. అయితే పాక్ కోర్టు తీర్పుపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) గతంలో విచారణ జరిపింది. పటిష్ఠ పున:సమీక్ష జరపాలని ఐసీజే తీర్పునిచ్చింది.
పాక్ మైనారిటీలపై..
పాకిస్థాన్లోని మైనారిటీ హక్కుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది విదేశాంగ శాఖ. మైనారిటీల భద్రత, రక్షణ, వారి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే దిశగా పాక్ చర్యలు చేపట్టాలని వెల్లడించింది. జులై 18న ఓ ఇంట్లో తనిఖీలు జరిపి బుద్ధుని విగ్రహాన్ని కనుగొన్నారని చెప్పింది. భౌద్ధ విగ్రహాన్ని పగలగొట్టకపోతే మతాన్ని వదులుకోవాల్సి వస్తుందని నలుగురు పాక్ పౌరులు ఇంటివారిని బెదిరించారని చెప్పారు.
ఇదీ చూడండి: కుల్భూషణ్తో భేటీకి భారత్కు మరో అవకాశం!