కరోనాపై సాగుతున్న యుద్ధంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గ్రామీణ భారతం మద్దతుగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో 74 శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నట్టు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. కరోనా సంక్షోభంతో భూములు, ఫోన్లు, వాచీలు అమ్మేసినా, ఇరుగుపొరుగు నుంచి అప్పులు చేసినప్పటికీ.. ప్రభుత్వ పనితీరుతో సంతృప్తి చెందడం విశేషం.
మీడియా సంస్థ గావ్ కనెక్షన్ ఈ దేశవ్యాప్త సర్వేను నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది.. తమ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితోనూ సంతృప్తి చెందినట్టు వెల్లడించింది గావ్ కనెక్షన్.
ఈ సర్వే కోసం 23 రాష్ట్రాల్లోని 179 జిల్లాలకు చెందిన 25,371మందిని.. మే 30 నుంచి జులై 16 వరకు ఇంటర్వ్యూ చేశారు. వీరందరూ ఇంటి పెద్దలేనని గావ్ కనెక్షన్ తెలిపింది.
ఈ 74 శాతం మందిలో 37 శాతం మంది.. మోదీ ప్రభుత్వ చర్యలతో చాలా సంతృప్తి చెందినట్టు.. మిగిలిన 37 మంది కొంతమేర సంతృప్తి చెందినట్టు తెలిపారు. అయితే మొత్తం మీద 14 శాతం మంది మోదీ ప్రభుత్వంతో అసంతృప్తిగా ఉన్నట్టు, 7 శాతం మంది అసలు సంతృప్తిగా లేనట్టు సర్వే పేర్కొంది.
సర్వే ప్రకారం.. లాక్డౌన్ అమలుతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై గ్రామీణ భారతం వైఖరిలో మార్పు రాలేదు. లాక్డౌన్లో వలసకూలీలపై మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన తీరు బాగుందా? లేదా? అన్న ప్రశ్నకు 73 శాతం మంది సానుకూలంగా స్పందించారు.
అయితే ఇతర రాష్ట్రాల వారి కన్నా.. భాజపా పాలిత రాష్ట్రాల్లోని వారు మోదీ ప్రభుత్వంతో కొంతమేర అసంతృప్తిగా కనపడినట్టు సర్వే వెల్లడించింది.
లాక్డౌన్లో 23 శాతం మంద గ్రామీణ భారతీయులు అప్పులు చేశారు. 8 శాతం మంది ఫోన్లు, వాచీలు అమ్మేశారు. 7 శాతం మంది ఆభరణాలను తాకట్టుపెట్టారు.
ఇదీ చూడండి:- వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి మోదీ శ్రీకారం