పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. భారీ దోపిడీకి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో గోల్డ్ లోన్ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 25 కిలోలకు పైగా ఆభరణాలు దోచుకెళ్లారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గిల్ రోడ్డు ప్రాంతంలో ఈ ఉదయం 10.15 గంటల సమయంలో ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఐఐఎఫ్‌ఎల్) శాఖలోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించగా.. ఒకడు బయట కారులోనే ఉన్నాడని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్‌ఎల్ భద్రతా సిబ్బంది అక్కడ లేరని తెలిపారు.
దుండగులు సంస్థలోకి ప్రవేశించి సిబ్బందిని భయపెట్టి.. ఆభరణాలు భద్రపరిచిన గది తాళాలు తీసుకున్నారని ఏసీపీ సందీప్ వాధేరా చెప్పారు. అనంతరం సిబ్బందిని తాళ్లతో కట్టి దాదాపు 25 నుంచి 30కిలోల మేర బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి ఉడాయించారని వివరించారు. ఇదంతా 20 నిమిషాల్లోనే జరిగిందన్నారు. దుండగులు అక్కడి నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్‌ఎల్ సిబ్బంది అలారం మోగించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ రాకేశ్ అగర్వాల్ వెల్లడించారు.