రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై 12 విపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి. వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రూల్ బుక్కు వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉన్నట్లు విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అయినా వాటన్నింటిని బేఖాతరు చేస్తూ చర్చ కొనసాగించారని.. హరివంశ్ వ్యవహారశైలిని తప్పుబట్టాయి.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రజాస్వామ్య సంప్రదాయాలను పరిరక్షించాలి. కానీ ఆయన వైఖరి నేడు ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, ప్రక్రియలకు హాని కలిగించింది. కాబట్టి మేము ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం
-- అహ్మద్ పటేల్, కాంగ్రెస్ ఎంపీ
బిల్లులకు ఆమోదం
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన 'ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్లు, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్స్ సర్వీసు' బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షాలు ప్రవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. కాంగ్రెస్, తెరాస, శిరోమణి అకాలీదళ్ సహా 14 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించినప్పటికీ.. బిల్లులకు ఆమోదం లభించింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.
విపక్షాల గందరగోళం
అంతకుముందు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. పోడియం వద్దకు దూసుకొచ్చి రూల్‌బుక్‌ను చించేసి డిప్యూటీ ఛైర్మన్‌పైకి విసిరారు. ఆయన వద్ద మైకు లాగేందుకూ ప్రయత్నించారు. దీంతో రాజ్యసభ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. బిల్లులపై సందేహాలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. కొత్తచట్టం వల్ల రైతులకు జరిగే ప్రయోజనాలేమిటో చెప్పాలని మాజీ ప్రధాని, ఇవాళే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన దేవెగౌడ్ కోరారు. బిల్లులను ఆగమేఘాల మీద ప్రవేశపెడుతున్నారని విమర్శించారు.
ఎంపీలపై చర్యలు!
డిప్యూటీ ఛైర్మన్‌తో దురుసుగా ప్రవర్తించిన సభ్యులపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు చర్యలు తీసుకునే అవకాశముంది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, కాంగ్రెస్ సభ్యుడు రిపుణ్ బోరా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, డీఎంకే సభ్యుడు తిరుచి శివ పోడియం వద్దకు వచ్చి మైక్ లాక్కుని, డిప్యూటీ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాగితాలు చించి వేయడంపై వెంకయ్య తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది.