రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో విపక్షాలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యాయి. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐఎమ్ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎమ్కే నేత టీకేఎస్ ఇళంగోవన్తో కూడిన బృందం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసింది. చట్టాలపై నిరసన తెలుపుతూ మెమొరాండం అందించింది.
"నూతన వ్యవసాయ చట్టాలను ఎలాంటి చర్చలు లేకుండా, ఓటింగ్ జరగకుండా, అప్రజాస్వామికంగా పార్లమెంట్లో ఆమోదించారు. ఈ చట్టాలు భారత ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. ఇవి భారత వ్యవసాయ రంగం, రైతులను నాశనం చేసే విధంగా ఉన్నాయి. కనీస మద్దతు ధరను రద్దు చేసేందుకు ఈ చట్టాలు పునాదులు వేస్తున్నాయి. వీటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి."
--- విపక్షాలు
ఇదీ చూడండి:- 'సాగు చట్టాలపై విపక్షాల రాజకీయం నిలవదు'
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రపతికి వివరించినట్టు పేర్కొన్నారు.
అప్రజస్వామికంగా ఈ చట్టాలను ఆమోదించిన ప్రభుత్వం.. ఎందరో రైతుల జీవితాలను ప్రమాదంలో పెట్టిందని ఆరోపించారు సీపీఎమ్ నేత సీతారామ్ ఏచూరి. అందువల్ల వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంతటి చలిలోనూ రైతులు నిర్విరామంగా ఆందోళనలు చేస్తున్నట్టు ఎన్సీపీ నేత శరద్ పవార్ పేర్కొన్నారు. వారి సమస్యలను తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.
ఇదీ చూడండి:- ఆ పథకానికి కేంద్రం ఆమోదం- లక్షలాది మందికి లబ్ధి