పౌరచట్టంపై విపక్షాల అసత్య ప్రచారాలే అల్లర్లకు కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. సీఏఏతో ఏ భారతీయ ముస్లిం పౌరసత్వాన్ని తొలగించరని స్పష్టం చేశారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సీఏఏకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు అమిత్ షా. పౌరచట్టంలో ఏ నిబంధన ప్రకారం మైనారిటీల పౌరసత్వాన్ని తొలగిస్తారని విపక్షాలను ప్రశ్నించాలంటూ పిలుపునిచ్చారు.
"పౌరసత్వ చట్టాన్ని కాంగ్రెస్, వామపక్షాలు, మమతా దీదీ అన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మైనారిటీల పౌరసత్వం పోతుందని చెబుతున్నాయి. ఇంతగా అబద్ధాలు చెప్పటం ఎందుకు? సీఏఏతో పౌరసత్వం తొలగించటమనేదే ఉండదు. పౌరసత్వం లభిస్తుంది. ఇలా అసత్య ప్రచారాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. అల్లర్లను రేకెత్తిస్తున్నారు."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
దేశాన్ని 70 ఏళ్లుగా పీడిస్తున్న అనేక సమస్యలకు ప్రధాని నరేంద్రమోదీ పరిష్కారం చూపారని అమిత్ షా ఉద్ఘాటించారు. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు వంటి నిర్ణయాలు ఇందులో భాగమేనని అన్నారు.