కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ప్రినీత్ కౌర్ డిమాండ్ చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధ్యనవాదాలు తెలిపే చర్చలో భాగంగా మాట్లాడిన ఆమె వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించారు. దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న అన్నదాతలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం అహంకారపూరిత వైఖరిని విడనాడాలన్నారు.
ఆందోళన చేస్తున్న రైతులను కొందరు ఖలిస్థానీ, మవోయిస్టులు అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ప్రినీత్. నిరసన చేస్తున్న ఓ రైతు సోదరుడు గతేడాడి గల్వాన్ లోయలో అమరుడైన జవాన్ అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి ఈ ప్రభుత్వమే నిజమైన ప్రమాదకారి అని, రైతులు కాదని వ్యాఖ్యానించారు.
మరోవైపు భాజపా ఎంపీ దిలిప్ సాయికియా.. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో ఈశాన్య రాష్ట్రాలను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వదిలేశారని, భాజపా అధికారంలోకి వచ్చి.. అసోం సహా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు.
బంగాల్లో బయటివారు..
కేంద్ర మంత్రులు బంగాల్లో రాజకీయ పర్యటన చేస్తున్నారని టీఎంసీ నేత సౌగతా రాయ్ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు బెంగాలీలు, బయటి వ్యక్తులకు మధ్యే అని వ్యాఖ్యానించారు. గుజరాతీలు బంగాల్పై పెత్తనం చెలయించడాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించబోరని పేర్కొన్నారు.
రైతు నిరసనల్లో కొందరు ఆందోళన జీవులున్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాయ్ మండిపడ్డారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో భాజపా సిద్ధాంతకర్తలెవరూ జైలుకు వెళ్లలేదని విమర్శించారు.