పశ్చిమ బెంగాల్లో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు... చర్చలకు రావాలన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానాన్ని మన్నించారు. చర్చా వేదిక ఎక్కడ అనేది తరువాత నిర్ణయిస్తామని తెలిపారు.
అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో చర్చలకు రావాలన్న ముఖ్యమంత్రి మమత ఆహ్వానాన్ని జూడాలు తిరస్కరించారు. బహిరంగ చర్చకోసం ఎస్ఆర్ఎస్ వైద్య కళాశాలకు రావాలని ఆమెను కోరారు. తాజాగా చర్చలకు తాము సిద్ధమేనని, అయితే తమ పాలకమండలే ప్రతిపాదిత చర్చా వేదికను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి నిజాయితీగా చర్చలకు రావడంలేదని వైద్యులు ఆరోపించారు. తమ సహచరులు కొందరు ముఖ్యమంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిశారన్న వార్తలను వారు ఖండించారు.
గుజరాత్లో చూసుకోండి...
బంగాల్లో జరుగుతున్న ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని హోంమంత్రిత్వశాఖ కోరడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. గత రెండేళ్లలో అనేత హత్యలు జరిగిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి నివేదికలు తీసుకోండని ఘాటుగా విమర్శించారు.
దేశవ్యాప్త ఆందోళన
వైద్యులపై దాడులకు నిరసనగా జూన్ 17న దేశవ్యాప్త ఆందోళనకు భారత వైద్య మండలి (ఐఎమ్ఏ) పిలుపునిచ్చింది. వైద్యులపై దాడుల్ని అరికట్టేలా కేంద్రంలో ఒక పటిష్ఠ చట్టాన్ని తీసుకుని రావాలని డిమాండ్ చేసింది. ఐఎమ్ఏ డిమాండ్‌పై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సానుకూలంగా స్పందించారు.
ప్రతిపక్షాల విమర్శలు...
జూడాల ఆందోళనకు పరిష్కారం చూపడంలో మమతా బెనర్జీ తీవ్ర అలక్ష్యంగా ఉన్నారని కాంగ్రెస్, సీపీఎం విమర్శించాయి. జూడాలకు క్షమాపణలు చెప్పి.. సమస్య పరిష్కారానికి మమతా బెనర్జీ కృషి చేయాలని హితవు పలికాయి.
ఇదీ జరిగింది..
నీల్‌రతన్ సర్కార్ (ఎన్ఆర్ఎస్) వైద్య కళాశాల ఆసుపత్రిలో చనిపోయిన ఒక రోగి బంధువులు, సోమవారం రాత్రి ఇద్దరు వైద్యులపై దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. దీంతో మంగళవారం నుంచి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వైద్య వ్యవస్థ దాదాపు స్తంభించింది.
ఇదీ చూడండి: మసాజ్ సౌకర్యంపై వెనక్కి తగ్గిన రైల్వే శాఖ