ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను ఎంత ద్వేషించినా ప్రేమనే తిరిగిస్తానని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. దిల్లీలోని చాందినీచౌక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జేపీ అగర్వాల్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. చాందినీచౌక్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ద్వేషాన్ని ప్రేమ మాత్రమే జయిస్తుందని, అదే ప్రేమ మే 23న ప్రధాని నరేంద్ర మోదీని ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
" ఆయన దేశానికి ప్రధాని(మోదీ). కానీ ఆయన ఓ అమరుడి(రాజీవ్ గాంధీ)ని అవమానించారు. ఆయనకు ఇది వరకే చెప్పా. మీరు నన్ను ఎంతో ద్వేషిస్తున్నారు. మీరు(మోదీ) నన్ను తక్కువ చేసి మాట్లాడగలరు, మా తండ్రి, తల్లి, తాత, నానమ్మ గురించి ఏమనుకుంటే అది మాట్లాడగలరు. మీరు నా మీద ఎంతో ద్వేషం కురిపిస్తున్నారు. అయినా నేను మీకు ప్రేమనే తిరిగిస్తానను." -- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
మోదీ వల్ల సంక్షోభంలో వ్యాపార రంగం
నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలతో వ్యాపార రంగాన్ని ప్రధాని మోదీ సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఆ నిర్ణయాలు వ్యాపారులకు ఎంతో నష్టం చేకూర్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ మనసులో మాట ప్రజలకెందుకు...
తనను తాను ప్రేమించుకునే వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు రాహుల్ గాంధీ. ఆయనకు ప్రజలంటే గౌరవం లేదన్నారు.
" 125 కోట్ల మంది దేశ ప్రజలపై మోదీకి గౌరవం లేదు. ఆయన్ను ఆయనే ప్రేమించుకునే ఏకైక వ్యక్తి మోదీ. ఆయన మన్కీబాత్(మనసులో మాట) వినడం ప్రజలకు అవసరం లేదు" -- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
లోక్సభ టికెట్ నిరాకరించి భాజపా అగ్రనేత అడ్వాణీని కూడా మోదీ అవమానించారని ఆరోపించారు రాహుల్ గాంధీ.