రుణాలిచ్చే యాప్‌లు వాటిని తిరిగి రాబట్టడానికి అమానుష చర్యలకు పాల్పడుతున్నాయని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ పేర్కొన్నారు. సొమ్ము వసూలు చేసే క్రమంలో వ్యక్తుల గౌరవానికి, మానవ హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదని ఆయన చెప్పారు. కొన్ని రుణ యాప్‌లు అప్పుల రికవరీలో నిర్దేశిత విధానాలను పాటించకుండా తప్పుడు మార్గాలను అవలంబిస్తున్నాయని ఈటీవీ భారత్‌తో అన్నారు.
రుణ యాప్‌ల వ్యవహారం చూస్తుంటే 2007లో ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన సూక్ష్మ రుణ సంస్థల దారుణాలు గుర్తుకొస్తున్నాయన్నారు ఆర్.గాంధీ. అప్పట్లో ఆ సంస్థలు తక్షణ రుణం పేరుతో చిన్న మొత్తాలు ఇచ్చి అధిక వడ్డీలతో పీల్చిపిప్పి చేశాయని, సొమ్ము కట్టలేనివారితో అమానుషంగా ప్రవర్తించాయని గుర్తుచేశారు. అప్పటి బాధితుల్లో ఎక్కువగా పేద, మధ్య తరగతివారే ఉన్నారన్నారు. ఇప్పుడు రుణ యాప్‌లు సైతం అదే వైఖరి ప్రదర్శిస్తున్నాయన్నారు. "రుణ యాప్‌లు ఆర్థిక అవసరం ఉన్నవారికి కోరుకున్న సమయంలో సులభతరంగా అప్పులిస్తున్నాయి. అంతమాత్రాన వారిపై సర్వహక్కులు ఉన్నట్లు వ్యవహరించరాదు" అని గాంధీ పేర్కొన్నారు. రుణ యాప్‌ల ధోరణి ఇలాగే కొనసాగితే సూక్ష్మరుణ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుణ గ్రహీతలతో మానవత్వంతో వ్యవహరించాలని చెప్పారు. ఆ యాప్ ఆధారిత రుణ సంస్థలు తమ వినియోగదారులతో వ్యవహరించాల్సిన విధానాలను సమీక్షించుకోవాలన్నారు.
ఇదీ చదవండి: పీఎం కేర్స్ ప్రభుత్వ అధీనంలోనిదే! కానీ..