రాజస్థాన్లో కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి మరో 17 మందికి వైరస్ వ్యాపించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ఆ బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులందరినీ గుర్తించే పనిలో పడ్డారు.
జైపుర్లోని రామ్గంజ్కు చెందిన ఆ వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి అతడికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. అయితే... కొద్ది రోజుల తర్వాత అదే ప్రాంతంలో మరిన్ని కేసులు వెలుగుచూశాయి. బాధితులంతా ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారేనని గుర్తించారు అధికారులు.
ఈ ఘటనను ఉదహరిస్తూ సామాజిక దూరమే కరోనా నియంత్రణకు ఏకైక మార్గమని హితబోధ చేస్తున్నారు అధికారులు. అదే కరోనా అంతానికి కీలకమని ఉద్ఘాటిస్తున్నారు.
రాజస్థాన్లో నేడు కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 129కి చేరింది.
ఒకరి నుంచి ముగ్గురికి...
కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి దాదాపు మరో ముగ్గురికి వైరస్ సోకే అవకాశం ఉందని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడానికి 'సోషల్ డిస్టెన్స్' పాటించడమే అత్యంత కీలకమని వివరించింది.