ఫిబ్రవరి 14 అంటే టక్కున గుర్తొచ్చేది ప్రేమికుల దినోత్సవం.. కానీ గుజరాత్ సూరత్‌లో ఇలా కాదు. అక్కడ అదే రోజున ప్రతి పాఠశాలలో విద్యార్థులు.. తల్లిదండ్రులను పూజించే ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గుర్తు చేసేలా.. మాతృ పితృ పూజన్ దివస్ (తల్లిదండ్రుల పూజోత్సవం) జరపనున్నట్లు స్పష్టం చేశారు జిల్లా విద్యాశాఖాధికారి. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో కొన్ని మార్గదర్శకాలు కూడా అందించారు. ఆయా పాఠశాలల్లో 5 నుంచి 10 తల్లిదండ్రుల జంటలను ఆహ్వానించి.. వారి పిల్లలతో సత్కరించాలని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు కార్పొరేటర్, పాఠశాల కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్తలు వంటి ప్రత్యేక అతిథులను ఆహ్వానించవచ్చన్నారు. ఆ రోజు ప్రత్యేకతనూ చాటి చెప్పే విధంగా ప్రసంగాలు ఉండాలని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
అవగాహన పెంపొందించాలి...
ఫిబ్రవరి 14న నిర్వహించే ఈ వేడుక ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలిసేలా.. ఇలాంటి విభిన్న కార్యక్రమాలను ఏర్పాటుచేసి వారిలో అవగాహన పెంచేలా చేయాలన్నారు సూరత్ డీఈఓ.
కార్యక్రమ సంబంధిత వివరాలు, ఛాయాచిత్రాలతో కూడిన నివేదికను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా స్పష్టం చేశారు.
అయితే.. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది విపక్ష కాంగ్రెస్. విద్యా ప్రమాణాల్ని మెరుగుపర్చకుండా.. లోపాల్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ ప్రతినిధి మనీశ్ దోషీ.