ఫొని తుపాను విధ్వంసంతో ఒడిశా తీరప్రాంతం భారీగా నష్టపోయింది. 11 జిల్లాల్లో నీరు, విద్యుత్, టెలికాం వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫొని ధాటికి మరణించిన వారి సంఖ్య 41కి చేరింది.
తుపాను ప్రభావం వీడి నాలుగు రోజులవుతున్నా వసతుల పునరుద్ధరణ పూర్తి కాలేదు. పనులు వేగంగా జరిగేలా ఇతర రాష్ట్రాల నుంచి సహాయక బృందాలను దింపింది ఒడిశా ప్రభుత్వం. ఫలితంగా విద్యుత్ వ్యవస్థ పునురుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
భువనేశ్వర్లో ఈ నెల 12కల్లా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు అధికారులు. ఛండక్ ప్రాంతంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించారు. 400 కేవీ లైను పునురుద్ధరణ పనులను పరిశీలించారు. తుపానులో అత్యంత భారీగా నష్టపోయిన ఆధ్యాత్మిక పట్టణం పూరీలోనూ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
రాష్ట్రంలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. ట్యాంకర్లు, అగ్నిమాపక వాహనాల్లోనూ నీటిని సరఫరా చేస్తోంది ప్రభుత్వం. సెల్ టవర్లు పునరుద్ధరణ పూర్తి కాలేదు. తుపాను ప్రభావంతో తీర ప్రాంతంలోని సుమారు 1.4 కోట్ల మంది ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చక్కబడే వరకు సమన్వయంతో వ్యవహరించాలని ప్రజలను కోరింది ప్రభుత్వం.
ఇదీ చూడండి: తేనెటీగలు... అతనికి ప్రియనేస్తాలు