కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్రం.. సడలింపులు చేస్తోంది. విమాన ప్రయాణాలపై ఒప్పందం(ఎయిర్ బబుల్స్ సదుపాయాలు) చేసుకున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు భారత్లో పర్యటించేందుకు అనుమతించింది.
ఆ దేశాలకు చెందిన ఇతరులకు కూడా వ్యాపార, వైద్య, ఉద్యోగ అవసరాలకు భారత వీసాలు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. అలాగే భారత పౌరులు కూడా ఆయా దేశాలకు ఎలాంటి వీసాపైనైనా ప్రయాణాలు చేయొచ్చని తెలిపింది.
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో ద్వైపాక్షిక వాయుమార్గ సదుపాయాలు/ఎయిర్ బబుల్స్ ఒప్పందాలు చేసుకుంది భారత్. ఈ పథకంలో త్వరలోనే మరిన్ని దేశాలను చేర్చనున్నట్లు హోంశాఖ తెలిపింది.
భారత్, చైనాకు ప్రయాణాలు వద్దు: అమెరికా
కరోనా తీవ్రత దృష్ట్యా భారత్, చైనాకు ప్రయాణాలు చేయొద్దని అమెరికా తన దేశ పౌరులకు సూచించింది. ఈ మేరకు పౌరులను అప్రమత్తం చేసే ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ దేశాల్లో ఉన్న తాజా పరిస్థితులు ఆరోగ్యం, భద్రత, నేరాలు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తుంది అమెరికా. దీనికోసం లెవల్-1 నుంచి లెవల్-4 వరకు సూచనలు జారీచేస్తుంది. ప్రయాణ మార్గదర్శకాలలో లెవల్-4 అతితీవ్ర సూచన. ప్రస్తుతం లెవల్-4 జాబితాలో భారత్, చైనాతోపాటు మరో 50దేశాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఆగస్టు 12న తొలి కరోనా వ్యాక్సిన్ విడుదల!