హిందూ సంప్రదాయానికి అయోధ్య రామమందిరం ఆధునిక చిహ్నంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భక్తికి, జాతీయ భావనకు రామమందిరం ప్రతీకగా ఉండనుందని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజల సంయుక్త సంకల్పానికి ఉన్న శక్తిని ఈ రామాలయం చాటిచెబుతుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు తరాలకు రామమందిరం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయోధ్య రామమందిర శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. మందిర నిర్మాణానికి భూమిపూజ చేయడం మహద్భాగ్యమని వెల్లడించారు. ఇంతటి అదృష్టాన్ని రామమందిర ట్రస్టు తనకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు చిన్నస్థాయి గుడి, టెంటులో ఉన్న రామమందిరం ఇకపై భవ్యమందిరంగా రూపుదిద్దుకోబోతుందని పేర్కొన్నారు.
ఈరోజున దేశమంతా అధ్యాత్మిక భావనతో నిండిపోయిందన్నారు మోదీ. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించడానికి... కన్యాకుమారి నుంచి క్షీరభవాని, కోటేశ్వర్ నుంచి కామాక్య, జగన్నాథ్ నుంచి కేథార్నాథ్, సోమ్నాథ్ నుంచి కాశీ విశ్వనాథుడి వరకు.. యావత్ దేశమంతా రామమయమైందని వెల్లడించారు. ఈనాటి జయజయధ్వనాలు విశ్వవ్యాప్తంగా వినిపిస్తాయన్నారు.
ఇదీ చూడండి:- పునాది రాయితో పులకించిన అయోధ్య