భారత్‌లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 84కి చేరింది. నాగ్‌పుర్‌లో మరో కేసు నమోదు కాగా... తెలంగాణలో ఒకరికి కొవిడ్ సోకినట్లు తెలుస్తోంది.
అయితే కరోనా నుంచి కొలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
"ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదుగురు, రాజస్థాన్, దిల్లీకి చెందిన మరో ఇద్దరికి కరోనా నయమైంది. చికిత్స పూర్తైన తర్వాత వారిని డిశ్చార్జ్ చేశాం."- కేంద్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి.
85 మంది కరోనా బాధితులకు సంబంధం ఉన్న 4 వేల మందిని పరిశీలనలో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఇరాన్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకొచ్చే విమానం.. రేపు అర్ధరాత్రికల్లా స్వదేశానికి చేరుకుంటుందని చెప్పారు. ఇటలీలో ఉన్న భారత విద్యార్థులను తీసుకురావడానికి ఎయిర్ఇండియా విమానాన్ని శనివారం పంపించనున్నట్లు పేర్కొన్నారు.
నాగ్‌పుర్‌లో మరొకరు
నాగ్‌పుర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 20కి చేరింది. వైరస్ సోకిన వ్యక్తిని నాగ్‌పుర్‌లోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుడు మరొక వ్యక్తితో కలిసి ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు వచ్చినట్లు వెల్లడించారు. మరో వ్యక్తికి ఇదివరకే కరోనా సోకినట్లు స్పష్టం చేశారు. నాగ్‌పుర్‌లో ఇప్పటివరకు నాలుగు కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్రలోని మొత్తం కేసుల్లో పుణెలో 10, ముంబయిలో 4, ఠాణె, అహ్మద్‌నగర్‌లో ఒకటి చొప్పున నమోదయ్యాయి.
అత్యవసర కేసులే విచారణ
మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి భయాందోళన కలిగిస్తున్న నేపథ్యంలో బొంబాయి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది.
బిహార్‌లో 144-సెక్షన్
కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో బిహార్‌లోని శివ్హార్ జిల్లాలో 144 సెక్షన్ విధించారు అధికారులు. నలుగురి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఒక చోట చేరకూడదని ఆదేశాలు జారీ చేశారు. బిహార్‌లో ఇప్పటివరకు కరోనా కేసు నమోదు కాలేదు. అయితే ముందు జాగ్రత్తగా అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సినిమా థియేటర్లను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
ఇదీ చదవండి: కరోనాను విపత్తుగా ప్రకటన- మృతుల కుటుంబాలకు పరిహారం