భారత్-చైనా సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధులైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ దిల్లీలో సమావేశమయ్యారు. 3500 కిలోమీటర్ల మేర ఉన్న భారత్-చైనా సరిహద్దుపై గల భేదాభిప్రాయలపై చర్చించారు. సరిహద్దులో శాంతి నెలకొనే దిశగా పలు అంశాలపై ప్రతినిధులు చర్చించారని సమాచారం. సరిహద్దు సమస్యపై తుది తీర్మానం పెండింగ్‌లో ఉన్నందున ఇరు దేశాలు సరిహద్దు వెంబడి ప్రశాంతంగా ఉండాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య తమిళనాడు మహాబలిపురం వేదికగా రెండో అనధికారిక సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి.
అయితే సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి వాంగ్‌యీ గత సెప్టెంబర్‌లోనే భారత్‌ను సందర్శించినప్పటికీ ఆ సమయంలో చర్చలు వాయిదా పడ్డాయి. గతంలో 21 దఫాల పాటు సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి గల ఇండో-చైనా సరిహద్దు అంశమై ఇరుదేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోండగా.. భారత్ తమ భూభాగమేనని ఉద్ఘాటిస్తూ వస్తోంది.
ఇదీ చూడండి: మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం