ఒకప్పుడు ఆచారం, కట్టుబాట్లు అంటూ అతివలు గడప దాటే అవకాశమే లేని మన దేశంలో ఇప్పుడు ఏకంగా అడవికే అండగా ఉంటున్నారు. అటు ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తమదైన గుర్తింపు ఏర్పరుచుకుంటున్నారు. దట్టమైన అరణ్యంలో రేయింబవళ్లు తేడా లేకుండా సింగిల్‌గా సింహాలను కాపాడుతున్నారు. గుజరాత్ జునాగఢ్‌లోని గిర్ అటవీ సంపదను సంరక్షిస్తున్నారు మహిళలు.
లేడీ సింగం..

ఆసియా సింహాలకు నెలవైన భారత గిర్ శాంచురీలోకి అడుగుపెట్టాలంటే ఎంతటివారైనా వణికిపోతుంటారు. కానీ, అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా అటవీ సిబ్బంది మాత్రం.. ఏ రాత్రైనా తుపాకీ చేతబట్టి.. బండి గేర్లు మార్చేస్తూ అడవిలోకి దూసుకెళ్తారు. వనంలోకి మాఫియా ప్రవేశించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటారు.

పురుషులు మాత్రమే చేయగలరనుకున్న అటవీ శాఖ ఉద్యోగాల్లో.. గత పదేళ్లలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు జునాగఢ్ సర్కిల్ అటవీ జంతు సంరక్షణ చీఫ్ కన్జర్వేటర్ సావడ. ఒక్క గిర్ ప్రాంతంలోనే దాదాపు 70 మంది మహిళా ఉద్యోగులున్నారని వెల్లడించారు. బీట్ గార్డులు, అటవీ అధికారులు, రేంజ్ అటవీ అధికారులు, డిప్యూటీ కన్జర్వేటర్ వంటి అన్ని స్థాయిల్లోనూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.
అబల కాదు సబలే...
2007లో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేక మహిళా విభాగం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. దీంతో అబలలుగా వివక్షకు గురైనవారే శివంగులై అడవిని ఏలుతున్నారు. పురుషులకు దీటుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: అడవులు.. ప్రాణంపోసే సంజీవనులు