కరోనా సోకిన వారు, లేదా వైరస్ లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నవారు గృహ నిర్బంధంలో ఉండాలని కేంద్రం సూచించింది. అలా కాదని.. వారు సాధారణ జనాల్లో కలిసి తిరిగితే ఇట్టే గుర్తుపట్టే ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. నిర్బంధంలో ఉండాల్సినవారి ఎడమ చేతిపై.. 'కరోనా నుంచి మిమ్మల్ని కాపాడుతున్నందుకు గర్వంగా ఉంది' అని ముద్ర వేస్తున్నారు అధికారులు.
ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరాను ఉపయోగించి ఈ స్టాంప్ వేస్తారు. ఈ సిరా గుర్తు కనీసం నెల రోజుల వరకు చర్మంపై నుంచి పోకుండా ఉంటుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
"కరోనా సోకినవారేమీ నేరం చేసినట్టు కాదు. వారికి సరైన చికిత్స, మనోస్థైర్యం అందించాలి. ఈ అంటువ్యాధిపై ప్రతి జిల్లా అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గృహ నిర్బంధంలో ఉన్నవారికి సరైన సౌకర్యాలు అందాలి. నిర్బంధంలో ఉన్నవారు దయచేసి స్వచ్ఛందంగా బయటకు రాకుండా ఉండండి. ఇతరులకు వైరస్ సోకే ప్రమాదాన్ని తగ్గించండి. మత పెద్దలంతా.. తమ పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ప్రజలకు తెలియజేయండి."
-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం.
మహారాష్ట్రలో ఇప్పటికే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనాను ఎదుర్కొనేందుకు రూ.45 కోట్లతో నిధిని ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నిధులను గృహ నిర్బంధంలో ఉన్నవారికి ఆహారం, టీవీ, ఇండోర్ గేమ్స్ వంటి సదుపాయాలు కల్పించేందుకు ఖర్చు చేయనున్నారు.
ఇదీ చదవండి:కరోనా భయంతో స్వీయ నిర్బంధంలో కేంద్రమంత్రి!