ఆ మహానగరంలో వందల కొద్ది ఆసుపత్రులున్నాయి. కానీ ఏం లాభం? వసతులు మాత్రం అంతంత మాత్రమే. అందుకే.. వైద్యం కోరి వచ్చిన ఓ తల్లిని ముప్పతిప్పలు పెట్టాయి. అమ్మను దక్కించుకునేందుకు తల్లడిల్లిన ఇంటర్ విద్యార్థిని ఐదు రోజుల పాటు నానా తంటాలు పడేలా చేశాయి.
ఐదు రోజుల వ్యథ..
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా సెక్టార్ 51లోని హోషియార్‌పుర్‌కు చెందిన ధీరజ్ కుమార్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ధీరజ్ తల్లి శకుంతల దేవీకి కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. దానికి తోడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మొదలయ్యాయి. ధీరజ్ సోదరిలిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. సెక్యూరిటి గార్డ్‌గా పనిచేసే తండ్రికి గాయమై ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో.. బాధ్యత తీసుకుని తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు 18ఏళ్ల ధీరజ్. ఐదు రోజుల పాటు వేర్వేరు ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు కానీ, ఎక్కడా అమ్మకు వైద్యం అందలేదు.
ఏం చేయాలో తెలియక గౌతంబుద్ధ నగర్ మేజిస్ట్రేట్ సుహాస్‌తో మాట్లాడాడు ధీరజ్. దీంతో ప్రధాన వైద్యాధికారి దీపక్ ఓహ్రితో మాట్లాడి ధీరజ్ తల్లికి సాయం చేస్తానని మాటిచ్చారు సుహాస్. కానీ, ఐదో రోజు అంబులెన్స్ కోసం ఎదురు చూసి, అలసిపోయి ఫోన్ చేస్తే మేజిస్ట్రేట్ స్పందించలేదు. చేసేదేమీ లేక అర్థరాత్రి 1గంటకు అమ్మను నోయిడా జీఐఎమ్ఎస్కు పంపారు.
"మేము ముందుగా ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ మాకు ఏవో మందులిచ్చి పంపేశారు. అమ్మకు నొప్పి తగ్గకపోయేసరికి మరుసటి రోజు.. మళ్లీ ఆసుపత్రికి వెళ్లాం. కానీ, వారు మమ్మల్ని కొవిడ్-పరీక్ష చేయించుకొమ్మన్నారు. ఆ తర్వాతి రోజు, మేము సుమారు మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా ఆసుపత్రికి వచ్చాం. అక్కడ బెడ్ ఖాళీగా లేదని మమ్మల్ని జీఐఎమ్ఎస్కు పంపిచారు. సాయంత్రానికి జిల్లా ఆసుపత్రిలో ఓ బెడ్ దొరికింది. కానీ, అక్కడి సిబ్బంది వసతులు లేవని బయటకు పంపించారు. చేసేదేమీ లేక 108కు ఫోన్ చేశాం. అంబులెన్స్ కోసం గంటల తరబడి ఎదురుచూశాం. తర్వాత అర్థరాత్రి ఒంటిగంటకు మేము జీఐఎమ్ఎస్లో చేరాం."
-ధీరజ్ కుమార్, బాధితుడు
ప్రస్తుతం శకుంతలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.
ఇది తొలిసారి కాదు..
నోయిడాలో ఇలాంటి ఘటన తొలిసారి కాదు. రెండు రోజుల క్రితమే ఎనిమిది ఆసుపత్రులు తిరిగిన గర్భిణి.. చివరికి అలసిపోయి మృత్యు ఒడికి చేరుకుంది. కనీస వసతులు లేని ఆసుపత్రుల నిర్లక్ష్య ధోరణి వల్ల.. బెడ్ కోసం 13 గంటలపాటు తిరిగి .. ఆఖరికి నొప్పిని భరించలేక అంబులెన్స్‌లో ప్రాణం విడిచింది ఆమె. గ్రేటర్ నోయిడాలో వసతులు లేని ఆసుపత్రుల చుట్టూ తిరిగి మే 25న ఓ చిన్నారి కన్ను మూసింది. ఇప్పుడు ధీరజ్, శకుంతలు నానా తంటాలు పడ్డారు.
ఇదీచదవండి:రామమందిర నిర్మాణం ప్రారంభం ఆ రోజే!