కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎదురైన సవాళ్లపై గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు, నోబెల్ గ్రహీత, ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వలస కార్మికులతో కూడిన అసంఘటిత రంగాన్ని విస్మరించకూడదని ఇరువురు అభిప్రాయపడ్డారు.
"వలస కార్మికులు మన నగరాలను నిర్మిస్తారు. వారి పునాదిపైనే మన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. కానీ మనం వారికి మెరుగైన జీవితం ఇవ్వడానికి కావాల్సినవి చేయలేకపోతున్నాం. ఈ రంగాన్ని మనం మర్చిపోకూడదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
'ఆర్థిక వ్యవస్థ వీరిని గుర్తించదు'
సమాజంలోని బలహీనతలను కరోనా వైరస్ బట్టబయలు చేసిందని ప్రొఫెసర్ యూనస్ పేర్కొన్నారు. పేద ప్రజలు, వలస కార్మికులు ఇప్పటివరకు నగరాల్లో దాక్కున్నారని చెప్పారు. వీరందరినీ కరోనా తమ స్వస్థలాలకు పయనమయ్యేలా చేసిందన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇలాంటి ప్రజలను గుర్తించదని వ్యాఖ్యానించారు.
"ఈ ప్రజలను మనం గుర్తించాలి. వీరిని ఎకనామిక్స్ కూడా గుర్తించదు. కేవలం అసంఘటిత రంగంగా పరిగణిస్తుంది. అసంఘటిత రంగం అంటే ఆర్థిక వ్యవస్థలో భాగం కాదు కాబట్టి దాని గురించి మనం చేయాల్సిందేమీ లేదు. ఆర్థిక వ్యవస్థ సంఘటిత రంగం నుంచే ప్రారంభమవుతుంది. మనం ఈ రంగంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం."
-ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్, ఆర్థిక వేత్త.
భారత్, బంగ్లాదేశ్ వంటి ఆర్థిక వ్యవస్థలు పాశ్చాత్య పోకడలను అనుసరించి అసంఘటిత రంగాన్ని విస్మరించాయని అభిప్రాయపడ్డారు యూనస్. అసంఘటిత రంగంలో సృజనాత్మకత ఉందని, పని చేయడంలో చిత్తశుద్ధి ఉంటుందని పేర్కొన్నారు. వారి సృజనాత్మకతకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం దూరంగా ఉండిపోయాయని చెప్పారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను స్వయం ప్రతిపత్తితో కూడిన సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎందుకు తీర్చిదిద్దడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు యూనస్. ఆర్థిక విధివిధానాలను పునఃపరిశీలించుకోవడానికి కరోనా రూపంలో ఓ అవకాశం లభించిందని.. గ్లోబల్ వార్మింగ్, నిరుద్యోగం వంటి సమస్యలు లేని ప్రపంచాన్ని నిర్మించాలని పేర్కొన్నారు.