పాకిస్థాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకునే వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు చేపట్టేది లేదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు పాక్‌తో కలిసిపనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నాశనం చేస్తోన్న ఐఎస్ఐ, ఉగ్రసంస్థలను అదుపు చేయాల్సిన అవసరం ఉందని సుష్మా పేర్కొన్నారు.
" తీవ్రవాదంపై మేము మాట్లాడాలనుకోవట్లేదు, దానిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. తీవ్రవాదం, చర్చలు కలసి నడవలేవు. ఉగ్రవాదం, హింసను నిర్మూలించడానికి ఇప్పటికీ పాకిస్థాన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. మీ వద్ద ఉన్న ఉగ్రవాదులపై చర్యలు చేపట్టాలి. భారత్‌లో తీవ్రవాద చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఎలాంటి చర్చలు జరగవు. ఇమ్రాన్‌ఖాన్‌కు ఉదార స్వభావం ఎక్కువగా ఉందని చెప్పారు. శాంతిని కోరుకుంటున్నామన్నారు. అంత ఉదారత కలిగిన వారైతే మసూద్ అజార్‌ను భారత్‌కు అప్పగించాలి. ఆయనకు ఎంత ఉదారత ఉందో చూద్దాం"- సుష్మా స్వరాజ్, భారత విదేశాంగ మంత్రి.
జైషే మహ్మద్ నాయకుడు మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న గడువు ముగింపునకు కొద్ది గంటల ముందు ఈ వ్యాఖ్యలు చేశారు సుష్మా. అజార్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని గత పదేళ్లలో భారత్ నాలుగుసార్లు ప్రతిపాదించింది. కాని మరోమారు చైనా తన కపట బుద్ధిని చూపించి భారత ప్రతిపాదనకు మోకాలడ్డింది.