తమిళనాడు తిరుప్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తోన్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలు.. తన కూతురిని చూసుకునే వారు లేక చెత్తబుట్టలో ఉంచి పనులు చేస్తోంది. చెత్త బండిపై ఉన్న డబ్బాల్లో ఒకదాంట్లో చిన్నారిని ఉంచి రోడ్డుపై తోసుకుంటూ చెత్త సేకరిస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మహారాష్ట్రకు చెందిన సుజాత అనే మహిళ తమిళనాడు తిరుప్పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు తమిళ భాష రాదు. పనిలోకి వెళ్లిన సమయంలో తన కూతురిని చూసుకునేందుకు నా అన్నవారు ఎవరూ లేరు. చేసేది ఏమీ లేక కూతురిని తనతోపాటే తీసుకెళ్లేది.
సుజాతకు ఇచ్చిన చెత్త బుట్టల్లోని ఒకదాంట్లో చిన్నారని ఉంచి బండిని తోసుకుంటూ చెత్త సేకరిస్తోంది. చెత్త డబ్బాల్లో చిన్నారి ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఈ విషయం తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ విజయ కార్తికేయన్ వరకు చేరింది. స్పందించిన కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలను చూసుకునేందుకు వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కార్మికుల భద్రతపై విమర్శలు..
వీడియోలో కార్మికురాలి చేతికి ఎలాంటి రక్షణ గ్లౌజులు, మాస్కులు లేకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్ని సౌకర్యాలు..
వైరల్‌గా మారిన ఫోటోలు, వీడియోలు పని పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో తీసినవిగా అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం గ్లౌజులు సహా ఇతర వ్యక్తిగత రక్షణ కిట్లకు కొరత లేదని వెల్లడించారు. సుజాత తన పని పూర్తయిన తర్వాత గ్లౌజులు, జాకెట్ తీసేసి ఉండొచ్చన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తోన్న కార్మికులకు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజ్‌లు, ఇతర రక్షణ సామగ్రి అందిస్తున్నామని స్పష్టం చేశారు.