పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశవ్యాప్త పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) చేపట్టబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు.
తనయుడు ఆదిత్య ఠాక్రేతో కలిసి ప్రధాని మోదీని ఉద్ధవ్.. శుక్రవారం కలిశారు. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన తర్వాత ప్రధాని మోదీతో ఉద్ధవ్ తొలిసారి భేటీ అయిందిప్పుడే. దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ వంటి అంశాలపై చర్చించామని భేటీ అనంతరం ఉద్ధవ్ మీడియాతో చెప్పారు.
"సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ గురించి మోదీతో చర్చించాం. ఇప్పటికే వీటిపై నా వైఖరి ఏంటో చెప్పాను. సీఏఏ గురించి భయపడాల్సిన అవసరం లేదు. దీని వల్ల మైనారిటీలు లబ్ధి పొందుతారు. దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీ నిర్వహించబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఎన్‌పీఆర్ వల్ల దేశం నుంచి ఎవరినీ పంపించడం జరగదు."
-ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి
మహారాష్ట్రలో శివసేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన 'మహా అఘాడీ' ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలనను పూర్తి చేసుకుంటుందని చెప్పారు. తమ మధ్య ఎలాంటి విభేదాలూ లేవని అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారని ఉద్ధవ్ తెలిపారు. దిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు.