సరైన వర్షాలు లేకపోవటం వల్ల దేశంలోని పలు నగరాల్లో ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతోంది. భూగర్భ జలాలపై ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదిక చేదు వార్తను వెల్లడించింది. నీటి వనరుల రక్షణ చర్యలు చేపట్టకుంటే... 2020 నాటికి దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి 21 నగరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతాయని పేర్కొంది.
నివేదిక ప్రకారం 2030 నాటికి దేశ జనాభాలో 40 శాతం మందికి కనీసం తాగు నీరు దొరికే పరిస్థితులు లేవని హెచ్చరించింది. నీటి వనరుల సంరక్షణ చర్యలు చేపట్టకుంటే తీవ్ర నీటి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది.
2020 ఎంతో దూరంలో లేదు. ఇప్పటి నుంచే చర్యలు చేపట్టక తప్పదు. చెన్నైలో మూడు నదులు, నాలుగు నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
" చెన్నైలో నీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం ఉప్పు నీటి శుద్ధిపై ఆధారపడుతోంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. భూమి చాలా చిన్నదని వారు మరిచిపోతున్నారు. సముద్రాలు కూడా ఇంకిపోతాయి. మన పిల్లలు, మనుమలకు మనం ఏమి వదులుతున్నాం? మన దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు కానీ నీటికి బదులుగా డబ్బును తాగమని పిల్లలకు చెప్పలేం. సముద్ర నీటిని శుద్ధి చేయటం సమస్య పరిష్కార మార్గం కాదు. కానీ నీటి వనరుల సంరక్షణే సరైంది. భూగర్భ జలాలు పెరిగేందుకు ప్రభుత్వం, ప్రజలు కలిసి పని చేయాల్సిన బాధ్యత ఉంది. "
- మనోహర్ ఖుషాలని, నేషనల్ వాటర్ అకాడమీ మాజీ డైరెక్టర్.
ఇదీ చూడండి: హెచ్చరిక: వేగంగా కరిగిపోతోన్న హిమాలయాలు