ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కొవిడ్ సోకిన 326 మంది డిశ్చార్జి అయినట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మొత్తం 4 వేల 421 కరోనా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం 3981 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. మరో 114 మరణాలు నమోదైనట్లు వెల్లడించారు. గత 24 గంటల్లోనే 354 కేసులు, 8 మరణాలు సంభవించినట్లు పేర్కొన్నారు.
కరోనా సమన్వయానికి నూతన విధానం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు అగర్వాల్. చికిత్స కోసం ఆస్పత్రులను రెండు విధాలుగా విభజించామని తెలిపిన ఆయన.. కరోనా తీవ్రత, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందించనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా లక్షణాలున్న వారిని కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న బాధితులకు ప్రత్యేక ఆస్పత్రుల్లో చికిత్స చేయనున్నట్లు వెల్లడించారు. క్వారంటైన్లో ఉన్నవారిని సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
ఒక్కరే 406 మందికి..
లాక్డౌన్, భౌతిక దూరం పాటించని.. ఒక కరోనా రోగి నుంచి 30 రోజుల్లోనే 406 మందికి కరోనా సోకే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది.
లాక్డౌన్ పొడిగింపుపై..
దేశంలో లాక్డౌన్ పొడిగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్నట్లు తెలిపిన లవ్ అగర్వాల్.. కేంద్రం దీనిపై ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. పొడిగింపుపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశారు.
లక్షా 7 వేల మందికి పరీక్షలు..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 7 వేల ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పష్టం చేసింది ఐసీఎంఆర్. ప్రస్తుతం 136 ప్రభుత్వ ల్యాబుల్లో చికిత్స అందిస్తున్నామని.. మరో 59 ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతినిచ్చినట్లు వెల్లడించింది.