తరచూ ప్రమాదాలు, మరణాలతో వార్తల్లో నిలిచే భారతీయ రైల్వే.. 2019లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది రైలు ప్రమాదాల్లో ప్రయాణికుల మృతుల సంఖ్య 'సున్నా' అని రైల్వే అధికారులు ప్రకటించారు. ఇది రైల్వే చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డు అని స్పష్టం చేశారు.
2018లో రైల్వే సిబ్బంది మరణాలు ఉన్నప్పటికీ.. ఈ ఏడాది కఠిన నియమాలు అమలు చేసి ఒక్క ప్రయాణికుడు కూడా ప్రాణాలు కోల్పోకుండా చూశామని వివరించారు.
మరణాలు తగ్గించడంలో సఫలం
ప్రతి ఏడాది రైలు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో భారతీయ రైల్వే విజయం సాధించింది. 2016-17లో 195, 2017-18లో 28, 2018-19లో కేవలం 16 మంది వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. (ఈ డేటాలో మనుషులను రైళ్లు ఢీకొట్టిన ఘటనలను పరిగణించరు. అందుకే గతేడాది దసరా రోజున అమృత్సర్లో రైలు ఢీకొని 59 మంది చనిపోయినప్పటికీ వారిని లెక్కలోకి తీసుకోలేదు. కాబట్టి 2018-19 ఏడాదిలో మరణాలను 16గానే ప్రకటించింది భారతీయ రైల్వే.)
" 1990-95 మధ్య కాలంలో ప్రతిఏడాది సగటున 500 ప్రమాదాలు చోటుచేసుకునేవి. ఆ ఐదేళ్లల్లో దాదాపు 2వేల 400మంది మృతిచెందగా.. 4వేల 300మంది గాయపడ్డారు. 2013-18 మధ్య కాలంలో ఈ సగటు చాలా తగ్గింది. ఐదేళ్లలో 110 ప్రమాద ఘటనల్లో 990మంది ప్రాణాలు కోల్పోయారు. 1,500మంది గాయాలపాలయ్యారు. "
- భారతీయ రైల్వే
పరిగణనలోకి తీసుకునే అంశాలు
రైళ్లు ఢీకొట్టడం, పట్టాలు తప్పడం, ఆగ్నిప్రమాదాలు, లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలతో పాటు మరికొన్నింటిని పరిగణనలోకి తీసుకుని మృతుల సంఖ్య లెక్కిస్తారు. అనంతరం ఆ మృతుల సంఖ్యను ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ఇతరులుగా విభజిస్తారు.
కేవలం ప్రమాదాలే.. మరణాల్లేవ్
2019-20లో ఇప్పటి వరకు రైలు పట్టాలు తప్పిన ఘటనలే చోటుచేసుకున్నాయి. కానీ ఎవరూ మరణించలేదని భారతీయ రైల్వే తెలిపింది. గత 12నెలల్లో 33మంది ప్రయాణికులు గాయపడ్డారని, పలువురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
ఇదీ చూడండి:- కొత్త ఏడాదిలో ప్రయాణికులకు రైల్వే షాక్.. ఛార్జీల పెంపు!