అయోధ్య వివాదంలో కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది నిర్మోహి అఖాడా. వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూమి చుట్టూ ఉన్న 67.39 ఎకరాల స్థలాన్ని అసలు యజమానులకు ఇవ్వాలని సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అభ్యర్థనను సవాలు చేస్తూ మరో వ్యాజ్యాన్ని వేసింది నిర్మోహి అఖాడా.
ఆ భూమిని రామజన్మభూమి న్యాస్కి ఇస్తే ఆ ప్రభావం మరిన్ని ఆలయాలపై పడుతుందని వ్యాజ్యంలో పేర్కొంది నిర్మోహి అఖాడా. ఒక పక్షానికే కేటాయిస్తే ఆ స్థలంలో ఉన్న మిగతా ఆలయ నిర్వాహకులు హక్కులు కోల్పోతారని తెలిపారు.
2010 అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం వివాదంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని మూడు పక్షాలకు కేటాయించారు. నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్లల్లాలకు సమాన భాగాలుగా పంచింది కోర్టు.
మిగిలిన 67.39 ఎకరాల విషయంలో సుప్రీంకోర్టు 2003లో ఇచ్చిన తీర్పును మార్చి అసలు యజమానులకు ఆ స్థలాన్ని ఇచ్చేయాలని కేంద్రం ఇటీవల వ్యాజ్యం దాఖలు చేసింది.
అయోధ్య వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల కమిటీని ఇటీవల సుప్రీంకోర్టు నియమించింది.
ఇదీ చూడండి: 'మందిరం.. జాతీయవాదం.. సంక్షేమం'