నిర్భయ దోషి వినయ్ శర్మకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
జస్టిస్ ఆర్ బానుమతి, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం వినయ్ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్ష జరిపేందుకు ఎలాంటి సహేతుక కారణం కనిపించడంలేదని స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలతో పాటు దోషికి సంబంధించిన మెడికల్ రిపోర్టును రాష్ట్రపతి ముందు ఉంచినట్లు పేర్కొంది ధర్మాసనం. తన మానసిక స్థితి బాగోలేదని దోషి వినయ్ పేర్కొనటాన్ని తప్పుపట్టింది. అతను మానసికంగా స్థిరంగానే ఉన్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
నాటకీయ పరిణామాలు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు ముకేశ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్లకు ఉరి అమలు పలుమార్లు వాయిదా పడింది. ఈనెల 1న ఉదయం ఉరి వేయాల్సి ఉండగా.. తమకు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం ఉందని దోషులు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జనవరి 31న ఉరి అమలును వాయిదా వేసింది కోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: స్పృహ తప్పిన సుప్రీం జడ్జి- 'నిర్భయ' కేసు తీర్పు చదువుతూ...