నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా క్యురేటివ్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించనుంది.
తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ కుమార్ గుప్తా పిటిషన్ దాఖలు చేశాడు. అటు డెత్ వారెంట్ల అమలుపై స్టే కోరుతూ పవన్ కుమార్‌తో సహా మరో దోషి అక్షయ్ సింగ్ శనివారం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తిహార్ జైలు అధికారులకు ట్రయల్ కోర్టు నోటీసు జారీచేసింది. సోమవారం నాటికి తమ స్పందన తెలియజేయాలని అధికారులను ఆదేశించింది.
ఇంకా అవకాశాలు...
నిర్భయ దోషులు ముకేశ్, వినయ్, అక్షయ్ ఇదివరకే క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయగా రాష్ట్రపతి తిరస్కరించారు. దీనిని సవాలుచేస్తూ ముకేశ్, వినయ్‌లు సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. వీరిరువురూ తమ న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకున్నారు.
ఇంకా అక్షయ్‌కు క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణను సవాల్ చేసే అవకాశముంది. పవన్ గుప్తా ఇంకా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో మార్చి 3న నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై అయితే మరోసారి సందిగ్ధం నెలకొంది.