నిర్భయ దోషులు మరణశిక్ష తప్పించుకునేందుకు లేదా జీవించే కాలాన్ని పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. మరణ శిక్ష అమలు నిర్ధరణ అయిన అనంతరం క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన నిందితులు అనంతరం రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష దాఖలు చేసి శిక్ష అమలు మరికొంత కాలం వాయిదా పడే విధంగా పావులు కదిపారు. ప్రస్తుతం రాష్ట్రపతి నిర్ణయం అనంతరమే శిక్ష అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ట్రయల్ కోర్టు శిక్షతో మొదలు
విచారణ చేసిన ట్రయల్ కోర్టు నిందితులకు మరణ శిక్ష విధించింది. తీర్పును సవాలు చేస్తూ నిందితులు ముఖేశ్‌కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్‌ను గతేడాది జులై 9న సుప్రీం తిరస్కరించింది. క్షమాభిక్షకు దరఖాస్తు చేసేందుకు ఏడు రోజులపాటు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో మరో నిందితుడు అక్షయ్‌కుమార్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. అతడి పిటిషన్‌ను కూడా సుప్రీం తిరస్కరించిన నేపథ్యంలో జనవరి 7న దిల్లీ పాటియాలా కోర్టు మరణ శిక్ష తేదిని నిర్ణయించింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలు చేయాలని ఆదేశించింది. అయితే న్యాయవ్యవస్థలో చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు నిర్భయ దోషులు. ఈ పిటిషన్లను కూడా తిరస్కరించింది సుప్రీం.
క్షమాభిక్ష దాఖలుతో సందిగ్ధం
ఈ నేపథ్యంలో రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు నిందితుడు ముఖేశ్. రాష్ట్రపతి నిర్ణయం వెలువడే వరకు మరణశిక్ష నిలుపుదలకు ఆదేశించాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ముఖేశ్ వ్యాజ్యాన్ని తిరస్కరించింది న్యాయస్థానం. సెషన్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలుకు అవకాశం కల్పించింది. న్యాయస్థానం అనుమతించిన మేరకు క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు శిక్షఅమలును నిలిపేయాలని దిల్లీ కోర్టును ఆశ్రయించాడు ముఖేశ్.
దిల్లీ ప్రభుత్వ వివరణ
రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్న కారణంగా ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి 22న తీర్పు అమలు నిర్వహించలేమని కోర్టుకు నివేదించింది దిల్లీ ప్రభుత్వం.
తాజా పరిస్థితులపై నిర్భయ తల్లి స్పందించారు. శిక్ష అమలుపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఏర్పాట్లు పూర్తి
జనవరి 13న జైలు అధికారుల బృందం నలుగురు డమ్మీ దోషులకు ఉరి తీసింది. దోషుల బరువు ప్రకారం ఇసుకతో నింపిన బస్తాలను ఉపయోగించి డమ్మీలను రూపొందించారు.
ఇదీ ఘటన
2012 డిసెంబర్ 16న ఓ ప్రైవేటు బస్సును నడుపుతున్న నిందితులు స్నేహితుడితో కలిసి ఉన్న బాధితురాలిని బస్సులో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమె స్నేహితుడిని కొట్టి నిర్భయపై హత్యాచారానికి ఒడిగట్టారు. మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. అనంతరం చికిత్స పొందుతూ బాధితురాలు కన్నుమూసింది.
ఇదీ చూడండి: నిర్భయ దోషులకు దిల్లీ హైకోర్టులోనూ నిరాశే