ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా బాలాకోట్‌లో ఫిబ్రవరి 26న భారత్ వాయుసేన దాడులు చేసిందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పునరుద్ఘాటించారు. పౌరులుండే ప్రదేశాల జోలికి సైన్యం వెళ్లలేదని ఏఎన్ఐకు ఇచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు.
వాయుసేన దాడులపై ఆధారాలు అడిగే వారికి పాక్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు నిర్మల.
"వాయుసేన దాడులపై ఆధారాలు కావాలని ఆర్టికల్స్ రాసేవారికి పాకిస్థానే జవాబు చెప్పాలి. తమపై దాడి జరగలేదని, అనేక మంది మృతిచెందలేదని స్పష్టం చేయాలి. దాదాపు 40 రోజలు తర్వాత కొంతమంది అధికారులను, మీడియాను ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ఆ విహారయాత్రనూ అక్కడి మదర్సా వరకే పరిమితం చేశారు. కొండ కింది ప్రాంతంలో మదర్సా ఉందని నేను కచ్చితంగా చెప్పగలను. కొండపై ఉన్న దట్టమైన అడవిలో ఉగ్రవాద శిక్షణ కేంద్రం ఉంది. ప్రజలను మదర్సాకు తీసుకెళ్లితే వారికి అక్కడ ఏమీ కనపడదు. పాఠశాలలు, పౌరులుండే ప్రదేశాలను సైన్యం ముట్టుకోలేదు. ఈ విషయంపై పాక్ ఎగతాళి చేస్తోంది. అక్కడి ప్రదేశాలను పరిశీలిస్తామని మీడియానే అడగాలి."
--- నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి
బాలాకోట్‌లో ఎందరో ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారన్న విషయాన్ని ఆ దేశ వెబ్సైట్లే ప్రకటించాయని రక్షణ మంత్రి తెలిపారు. ఆ వెబ్సైట్లను చూస్తే ఎంతమంది ఉగ్రవాదులను భారత వాయుసేన హతమార్చిందో అంచనా వేయవచ్చన్నారు.
ఇదీ చూడండి: ఈసీకి రాహుల్, మోదీలపై ఫిర్యాదులు