గుజరాత్ సూరత్‌లో శుక్రవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై వివరణ ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసు జారీ చేసింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు మరణించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం విషయంలోనూ ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిహారం ప్రకటించడం ఇలాంటి మానవ సంబంధ విపత్తులకు పరిష్కారం కాదని అభిప్రాయపడింది. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపడుతున్నామని మానవ హక్కుల కమిషన్ తెలిపింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ప్రమాదానికి బాధ్యులైన భవన యజమానులు, అధికారులపై నమోదు చేసిన కేసుల వివరాలూ తెలపాలని సూచించింది.
నిర్లక్ష్యమే కారణం..
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలకు భవన నిర్మాతలు, అధికారుల నిర్లక్ష్యంతో పాటు సరిపడా అగ్నిమాపక కేంద్రాల కొరతా ఓ కారణమేనని ఎన్హెచ్ఆర్సీ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా మెరుగైన చికిత్స అందించాలని సూచించింది. ఈ విషయంపై రాష్ట్రప్రభుత్వం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
భవన నిర్మాణాలకు ఉన్న చట్టపరమైన అనుమతులు, ప్రమాదాల నివారణకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు, ఫైర్ సేఫ్టీ అనుమతుల గురించి, అలాగే బాధిత కుటుంబాలకు ఇచ్చిన పరిహారం విషయాన్నీ తెలపాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది.
ఇదీ జరిగింది..
శుక్రవారం సూరత్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు మరణించారు. ఇందులో 18 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరంతా 15 నుంచి 22 లోపు వయస్సువారే.
మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం తలో రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది.
నిందితుల అరెస్టు..
ప్రమాదానికి కారణమని భావిస్తోన్న కోచింగ్ క్లాస్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. భవన యజమానులు ఇద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: సీడబ్ల్యూసీ భేటీ: అధ్యక్షుడిగానే రాహుల్!