దేశ రాజధానితో గాలి నాణ్యత క్షీణించిన నగరాల్లో టపాసుల విక్రయంపై విధించిన నిషేధాన్ని పొడిగించింది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ). దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత 'మోడరేట్'గా ఉన్న ప్రాంతాల్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో రెండు గంటల(అర్ధరాత్రి 11:55 నుంచి 12:30)కు మించి టపాసులు కాల్చొద్దని ఆదేశించింది.
" కొవిడ్-19 దృష్ట్యా దిల్లీతోపాటు వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అన్ని రకాల టపాసుల విక్రయాలు, వాడకంపై నిషేధం కొనసాగుతుంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈసమయంలో బాణ సంచా వాడితే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది."
--జాతీయ హరిత ట్రైబ్యునల్
నిషేధించిన టపాసులను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని జిల్లా కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. బాణ సంచా పేలుళ్లలో గాయపడ్డ బాధితులు నేరుగా జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసి తగిన నష్ట పరిహారం పొందవచ్చని తెలిపింది.
ప్రతి జిల్లాలో ఒక గాలి నాణ్యత పరిశీలన స్టేషన్ను ఏర్పాటు చేయాలని గతంలో చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. క్షేత్ర స్థాయిలో గాలి నాణ్యతను అంచనా వేసేందుకు వివిధ శాఖల నుంచి ఆరుగురు సభ్యులతో కూడిన ఓ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి : 'కాలుష్య' నగరాల్లో బాణసంచా అమ్మకాలపై నిషేధం