జాతీయ నూతన విద్యావిధానంలో సంస్కరణలపై నిర్వహించిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటి వరకు ఏం ఆలోచించాలో చెప్పే విధంగా ఉన్న విద్యావ్యవస్థ.. ఇకపై ఎలా ఆలోచించాలో తెలిపే విధంగా ఉంటుందని వివరించారు. నవ భారత్‌ను నిర్మించేందుకు నూతన విద్యావిధానం పునాదిలా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
" నూతన విద్యావిధానం ఆరోగ్యకరమైన చర్చలను లెవనెత్తే విధంగా ఉంది. ఎంత ఎక్కువ చర్చిస్తే విద్యా వ్యవస్థకు అంత ప్రయోజనం. ఈ భారీ ప్రణాళికను ఎలా అమలు చేయాలనే విషయంపై ప్రశ్నలు తలెత్తుతాయి. మనమంతా ఐక్యంగా దీనిని అమలు చేయాలి. నూతన విద్యావిధానం అమలులో మీరంతా ప్రత్యక్షంగా అంతర్లీనమై ఉంటారు. రాజకీయ సంకల్పం విషయంలో నేను మీకు అండగా ఉంటాను. "
-ప్రధాని మోదీ.
గత 34 ఏళ్లలో విద్యావిధానంలో పెద్దగా మార్పులు లేవని చెప్పారు మోదీ. ఫలితంగా విలువలు, ఉత్సుకత, ఆలోచనలను ప్రోత్సహించడానికి బదులు మంద మనస్తత్వానికి ప్రోత్సాహం లభించిందన్నారు. ఆసక్తి, సామర్థ్యం, డిమాండ్‌కు తగిన విధంగా విద్యావ్యవస్థ ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. విమర్శనాత్మక ఆలోచనలు, వినూత్న ఆలోచన సామర్థ్యాలను యువత పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
" ఇప్పటివరకు ఏం ఆలోచించాలనే విషయంపైనే దృష్టి సారించాం. నూతన విద్యావిధానంతో ఎలా ఆలోచించాలి అనే విషయంపై దృష్టి కేంద్రీకరించనున్నాం. సమాచారం, కంటెంట్ వరదలా ప్రవహిస్తున్నప్పుడు ఏ సమాచారం ముఖ్యం? ఏది అవసరం లేదో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనకు విచారణ ఆధారిత, ఆవిష్కరణ ఆధారిత, విశ్లేషణ ఆధారిత బోధనా విధానాలు అవసరం. ఇది తరగతిలో నేర్చుకోవడానికి ఆసక్తిని పెంచుతుంది.
కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై ఏ వర్గమూ అసంతృప్తి వ్యక్తం చేయకపోవడం సంతోషకరం. భారతీయ ప్రతిభ దేశంలోనే ఉండేలా, భవిష్యత్ తరాల అభివృద్ధికి దోహదపడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విధానంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు ఉంటుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాని.