జస్టిస్ ముఖర్జీ కమిషన్ నివేదిక విశ్వసనీయతపై నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా, ఆధారాలు చూపకుండానే నేతాజీ మరణించారని పేర్కొడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు నేతాజీ మునిమేనల్లుడు సూర్య బోస్, మునిమేనకోడలు మాధురి బోస్ బహిరంగ లేఖ రాశారు.
2005 నవంబర్ 8న జస్టిస్ మనోజ్ కుమార్ ముఖర్జీ తన నివేదికలో.. నేతాజీ తైవాన్ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొన్నారని లేఖలో గుర్తు చేశారు. టోక్యోలోని రెంకోజీ మందిరంలో ఉన్న అస్థికలు నేతాజీవి కాదని నివేదికలో స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
"నేతాజీ మరణించారని ఆయన సాధారణంగా తేల్చేశారు. తైవాన్‌లో విమాన ప్రమాదం జరగలేదని, కాబట్టి ఆ ప్రమాదంలో నేతాజీ మరణించలేదని చెప్పిన సాక్ష్యాలు, వాదనలు విశ్వసనీయమైనవి కాదు."
-నేతాజీ కుటుంబ సభ్యుల లేఖ
అయితే బోస్ మరణంపై కమిషన్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఏ ప్రాంతంలో, ఏ విధంగా నేతాజీ చనిపోయారన్న విషయాన్ని చెప్పలేదన్నారు.
డీఎన్ఏ పరీక్ష ఎందుకు చేయలేదు?
1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని జపాన్ అధికారికంగా ప్రకటించి 75 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు బోస్ కుటుంబసభ్యులు. అయితే ఆయనకు ఏం జరిగిందనే ప్రశ్న మాత్రం జనాల మనసుల్లో ఇప్పటికీ సజీవంగానే ఉందని పేర్కొన్నారు. రెంకోజీ మందిరంలోని అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలనే వాదనను జస్టిస్ ముఖర్జీ కమిషన్ పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.
"రెంకోజీ మందిరంలో ఉన్న అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు చేయాలని జస్టిస్ ముఖర్జీ కమిషనన్‌కు వాదనల సందర్భంగా నిపుణులు సూచించారు. కానీ ఆ విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రెంకోజీ మందిర అధికారులు సహకరించేందుకు సిద్ధమైనప్పటికీ.. డీఎన్ఏ పరీక్షలకు జస్టిస్ ముఖర్జీ నిరాకరించారు."
-నేతాజీ కుటుంబ సభ్యులు
జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన పది పరిశోధనల్లో తొమ్మిది పరిశోధనలు నేతాజీ తైహొకు విమాన ప్రమాదంలోనే మరణించారని స్పష్టం చేశాయని గుర్తుచేశారు బోస్ కుటుంబ సభ్యులు.
"జపాన్ అధికారికంగా ప్రకటించినట్లు తైహొకు ఎయిర్ క్రాష్లోనే నేతాజీ మరణించారని 10లో తొమ్మిది పరిశోధనలు వెల్లడించాయి. మిగిలిన ఆ ఒక్కటే జస్టిస్ ముఖర్జీ విచారణ కమిషన్. షా నవాజ్(1956), ఖోస్లా(1974) కమిషన్ల తర్వాత స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడో కమిషన్ ఇది. ఈ రెండు కూడా నేతాజీ 1945 ఆగస్టు 18న తైహొకులోని సైనిక ఆస్పత్రిలో మరణించాయని తెలిపాయి. రెంకోజి మందిరంలో ఉన్న అవశేషాలు ఆయనవే అని తేల్చాయి."
-నేతాజీ కుటుంబ సభ్యులు
నేతాజీ 1945 విమాన ప్రమాదంలోనే మరణించారని 2017లో పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే ఏడాది జూన్ 1న కేంద్ర హోంశాఖ ఆర్టీఐ దరఖాస్తుకు ఇచ్చిన స్పందనలోనూ ఇదే స్పష్టం చేసింది వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది.
కొన్నేళ్లుగా కేంద్రం, బంగాల్ ప్రభుత్వాలు నేతాజీకి సంబంధించిన వందలాది దస్త్రాలను పరిశీలించాయి. అయితే బోస్ మరణంపై వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.